ఒక పరిచయం:
ప్రతి సంవత్సరం జూన్ 21 న, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు 2014లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు, ఆధునిక ప్రపంచానికి భారతదేశపు ప్రాచీన ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం యొక్క విశిష్టమైన తోడ్పాటును గుర్తించే ఒక అవకాశం ఇది.
చాలా మంది యోగాను శారీరక వ్యాయామాలుగా మాత్రమే భావించినప్పటికీ — హఠ యోగా యొక్క ఆసనాలు లేదా భంగిమలు — మానవ మనస్సు మరియు ఆత్మ యొక్క అనంతమైన సామర్థ్యాలను విశదపరచడమే యోగా యొక్క నిజమైన ఆవశ్యకత మరియు ఉద్దేశ్యం. యోగా అనే పదానికి అర్థం — వ్యక్తిగత చైతన్యం లేదా ఆత్మకు విశ్వచైతన్యం లేదా పరమాత్మతో — “ఐక్యత”.
“ఆత్మతో పరమాత్మను ఏకం చేయడమే యోగా — అందరూ కోరుకునే ఆ గొప్ప ఆనందంతో పునఃకలయిక,” అని పరమహంస యోగానందగారు చెప్పారు. “ఇది అద్భుతమైన నిర్వచనం కాదా? ఆత్మ యొక్క నిత్య నూతన ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నప్పుడు ఏ ఇతర ఆనందం కన్నా అది గొప్పదని మరియు ఏదీ మిమ్మల్ని దిగజార్చలేదని మీరు నమ్ముతారు.”
ప్రతి ఒక్కరూ ఆ స్వచ్ఛమైన ఆనందకర స్థితిని చేరుకోగలరు, కాని అలా చేయడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి అవసరం మరియు జీవితంలోని అన్ని అంశాలలో ఆ యోగ పద్ధతిని ఆచరించాలనే ఒక అభిలాష అవసరం — అది కేవలం ఒక్క రోజు మాత్రమే కాదు, దాని నిజమైన ప్రయోజనాలు తనలో తనను గ్రహించే వరకు స్థిరంగా కొనసాగాలి.
దీనికి కారణం యోగా యొక్క శక్తివంతమైన ప్రక్రియలు మరియు సూత్రాలు — పరమహంసగారు మరియు వారి ఉత్కృష్ట గురుపరంపర, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క క్రియాయోగ బోధనల్లో నేర్పించిన వంటివి — జీవితంలో పరివర్తన తీసుకువచ్చే ఫలితాల కోసం విశ్వవ్యాప్తంగా ఉపయోగించవచ్చు. అటువంటి యోగాను నిజమైన వేడుకగా ప్రపంచమంతా జరుపుకోవచ్చు.
ఈ క్రింద పంచుకున్న పరమహంసగారి విజ్ఞానం ద్వారా, అందరి చేత యోగా ఒక సర్వోన్నత సానుకూల శక్తిగా గౌరవించబడుతుంది మరియు క్రియాయోగ మార్గం దాని ప్రఖ్యాత ఆచరణాత్మక పద్ధతులతో అంతిమ స్వేచ్ఛ మరియు ఆనందానికి ఒక అన్వేషకుణ్ణి ఎలా నడిపిస్తుందో ప్రతిబింబిస్తుంది. ఆ తరువాత, పరమహంసగారు తన ఒక యోగి ఆత్మకథలో పేర్కొన్నట్లుగా, “ప్రపంచానికి భారతదేశం మరే బహుమానం ఇవ్వకపోయినా, ఒక్క క్రియాయోగం మాత్రమే దివ్యమైన సమర్పణగా సరిపోతుంది.”
పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి:
యోగా అనేది ప్రధానంగా ధ్యానం యొక్క శాస్త్రం: భగవంతుడిపై ఏకాగ్రత మరియు తన చైతన్యాన్ని ఆయనలో గ్రహించడం. కాని భగవంతుడిపై నిరంతరాయంగా ధ్యానం చేయగల సామర్థ్యానికి సహజమైన అవసరంగా, మానవ స్వభావం మరియు దైనందిన జీవితంలోని ప్రతి అంశాన్ని ఆధ్యాత్మికం చేయడానికి కావలసిన క్రమశిక్షణ మరియు సరైన దిశను కూడా యోగా కలిగి ఉంటుంది.
ఉదాహరణకు, ఆత్మ నిర్దేశం — ఆత్మసాక్షాత్కారంతో జనించే జ్ఞానం — ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని యోగా కలుగజేస్తుంది. మనస్సుని సమస్యలు ఆక్రమించి ఉన్నంతవరకూ మానసికమైన, ఆధ్యాత్మికమైన స్వేచ్ఛకు చోటు ఉండదు, ఎందుకంటే ఆ స్వేచ్ఛ మానసిక సంక్షోభంతో సహజీవనం చేయలేదు. కలవరపరిచే విపరీత మనఃస్థితులను, ఆందోళనలను, భయాలను మనస్సు నుండి తొలగించి, మానసిక ప్రశాంతత అనే ఆకాశంలో ఆత్మ అనే విముక్త స్వర్గ విహంగం మీ అస్తిత్వమంతటా తన రెక్కలు విప్పార్చుకొని విహరించడానికి వీలు కల్పించాలి. ఆంతరికంగా, బాహ్యంగా జీవితానికి భారమయ్యే కష్టాలను, జటిలతలను క్రమేణా ఉపశమింపజేయడం ద్వారా యోగం స్వేచ్ఛ వైపుకు మార్గాన్ని సుగమం చేస్తుంది.
వ్యాపారంలోను, సామాజికంగాను, శారీరకంగాను, మానసికంగాను మరియు ఆధ్యాత్మికంగాను అభివృద్ధి చెందేందుకు యోగదా సత్సంగం యొక్క యోగ బోధనలను జీవితంలోని ప్రతి దశకు వర్తింపజేయవచ్చు. అటువంటి ఆధ్యాత్మిక సత్యాలను అన్ని విధాలుగా ఆచరించడం, ఉత్కృష్టమైన ఆనందాన్ని కలుగజేస్తుంది.
మన మహాగురువుల మార్గమైన ఈ ఎస్.ఆర్.ఎఫ్. [వై.ఎస్.ఎస్.] కు నా జీవితాన్ని అర్పించాను, ఎందుకంటే ఈ బోధనలు ఆచరణాత్మకమైన ఒక పద్ధతిని ప్రపంచానికి అందిస్తాయి, దీని ద్వారా భక్తులందరూ తాము భగవంతుని వైపు పురోగమిస్తున్నామని స్పష్టమైన అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు.
ధ్యానాన్ని నిరంతరం అభ్యాసం చేయడం ద్వారా, మీరు నిత్య నూతనమైన, నిరంతరము పెరుగుతున్న ఆనందం యొక్క అవగాహనలను పొందుతారు, ఇది కేవలం స్వల్పకాలిక మర్త్య సౌఖ్యానికి సంబంధించిన ప్రత్యేకమైన మానసిక స్థితి కాదు, కాని ధ్యానం యొక్క భగవదానందం మీ ప్రార్థనలను స్వీకరించి ప్రతిస్పందిస్తుంది.
ధ్యానంలో కలిగే ఆనందమే భగవంతుడు. వై.ఎస్.ఎస్. పాఠాలలో ఇచ్చిన క్రియాయోగ శాస్త్రం యొక్క ప్రక్రియలను అభ్యసించడం ద్వారా, మీరు ఆ ఆనందాన్ని పొందుతారు. అంతటి ఆనందాన్ని ఇచ్చేది ఏదీ ప్రపంచంలో నాకు తెలియదు. ఒక్కసారి కనుక మీరు భగవంతునితో అనుసంధానం పొందితే, ఆయన కన్నా ఎక్కువగా ఈ భూమిపై మీరు కోరుకొనేది మరేదీ లేదని మీరు తెలుసుకుంటారు.
“యోగా యొక్క నిజమైన అర్థం” గురించి తెలుసుకోవడానికి వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్ ను సందర్శించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆత్మ యొక్క పరమానందాన్ని మరింత ఎక్కువగా అనుభవించడానికి యోగా అందించే సార్వత్రిక మరియు శాస్త్రీయ విధానం గురించి అక్కడ మీరు మరింతగా తెలుసుకోవచ్చు.