పశ్చిమ దేశాన పరమహంస యోగానందగారి మొదటి ప్రసంగం మరియు దాని శాశ్వత సందేశం

4 అక్టోబరు, 2024

సెప్టెంబర్ 2020 వార్తా-లేఖ నుండి ప్రేరణ

యోగానందగారు 1920 వ సంవత్సరం అక్టోబర్ మాసంలో బోస్టన్‌లో మతపరమైన ఉదార వాదుల అంతర్జాతీయ మహాసభకు తోటి ప్రతినిధులతో హాజరయ్యారు — ఆ సందర్భంలో ఆయన మొదటిసారిగా అమెరికాలో “మత విజ్ఞాన శాస్త్రం” పై ప్రసంగించారు

సెప్టెంబర్ 19, 1920 న పరమహంస యోగానందగారు అమెరికాకు వచ్చిన మహత్తరఘట్టం యొక్క వార్షికోత్సవాన్ని ఈ మాసంలో మనం జరుపుకుంటాం.

వచ్చిన కొద్దికాలానికే, యోగానందగారు ఒక సంస్థను ప్రారంభించి, ఆ తరువాత దానికి ఆయన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అని నామకరణం చేశారు. భారతదేశం నుండి తీసుకువచ్చిన క్రియాయోగ విజ్ఞాన శాస్త్రాన్ని వ్యాప్తి చేయడం కోసం స్థాపించబడిన ఎస్.ఆర్.ఎఫ్., గురుదేవుల జీవితకాలంలోనే ప్రపంచవ్యాప్త సభ్యత్వాన్ని పొందే స్థాయిలో వృద్ధి చెందింది. (భారతదేశంలోను మరియు పొరుగు దేశాలలోను పరమహంసగారి కార్యాచరణను యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.) 1952 లో ఆయన గతించినప్పటి నుండి, ప్రపంచవ్యాప్తంగా నిరంతరం వృద్ధిచెందుతున్న అనుచరవర్గంచే స్వీకరించబడుతూ యోగానందగారి బోధనల ప్రభావం విస్తరిస్తూనే ఉంది.

వంద సంవత్సరాల క్రితం యోగానందగారు బోస్టన్‌లో తొలిసారి అడుగుపెట్టిన చారిత్రాత్మక ఘట్టానికి గౌరవ సూచకంగా, మనం అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఆయన మొట్టమొదటి ప్రసంగాన్ని తిరిగి పరిశీలిద్దాం — “మత విజ్ఞాన శాస్త్రము.” అమెరికాకు వచ్చిన రెండు వారాల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత నాయకుల మహాసభలో మాట్లాడిన యోగానందగారు భారతదేశం యొక్క సార్వత్రిక ఆధ్యాత్మికత — సనాతనమైనప్పటికీ సమయోచితమైన ఆదర్శాలు, ఇవి చాలా మంది పాశ్చాత్యులకు క్రొత్తవి అయినప్పటికీ ఆధునిక శాస్త్రీయ యుగానికి ఆదర్శప్రాయమైనవి — గురించి ప్రభావవంతంగా ప్రసంగించారు.

నిజమైన మతం పిడివాదం కాదు, కాని అది విశ్వజనీనమైనదని, భగవంతుడిని పరమానందంగా భావించవచ్చని యోగానందగారు ధృవీకరించారు. ఆయన సహజావబోధం యొక్క శక్తి గురించి మాట్లాడారు, కేవలం తర్కంతో కాక, దీని ద్వారా భగవంతుడు వాస్తవంగా మన అనుభవంలోకి వస్తాడు. అన్నిటికంటే మిన్నగా, భగవత్ సాక్షాత్కారం పొందేందుకు మనలో నిగూఢంగా ఉన్న సహజావబోధక శక్తిని పెంపొందింపజేసుకొనే, ఒక ఆచరణాత్మక పద్ధతిని ఆయన తన శ్రోతలకు వివరించారు. ప్రాణశక్తిని సచేతనంగా నియంత్రించే ప్రక్రియలు — క్రియాయోగ శాస్త్ర ప్రక్రియలు — ఈ పద్ధతిలో ఉన్నాయి. ఆయన తన జీవితకాలంలో దాదాపు 1,00,000 మందికి క్రియాయోగ దీక్షను అనుగ్రహించారు. ఆయన ఇచ్చిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పాఠాల ద్వారా నేటికీ దాని వ్యాప్తి కొనసాగుతోంది.

యోగానందగారి చిరస్మరణీయమైన విస్తృత ప్రసంగం మత విజ్ఞాన శాస్త్రము అనే పుస్తక రూపంలో ఉన్నది, క్రింద ఇచ్చిన సారాంశం దాని నుండి ఎంపిక చేయబడింది, 1920లలో మొదటిసారిగా ప్రచురింపబడినప్పటి నుండి వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ద్వారా ముద్రించబడుతూనే ఉంది.

భగవంతుని గూర్చిన మన భావన ప్రతిరోజూ కాదు, ప్రతిగంటా మనకు మార్గదర్శకంగా ఉండాలి. భగవంతుని గురించిన భావనే మన దైనందిన జీవితాల మధ్యలో కూడా ఆయనను అన్వేషించేటట్టు మనలను పురిగొల్పాలి.

మనకు ఏ అవసరం తీరాలన్నా, ఇతరులతో వ్యవహరించేటప్పుడూ, ధనం సంపాదించాలన్నా, పుస్తకం చదవాలన్నా, ఒక పరీక్షలో ఉత్తీర్ణత పొందాలన్నా, ఎంత చిన్న పని అయినా, అత్యున్నత కర్తవ్యాలు నెరవేర్చాలన్నా, భగవంతుడు లేకుండా మనం ఏ పనీ చేయలేము అనే భావన లేకపోతే, భగవంతునికి జీవితానికి మధ్య గల సంబంధాన్ని మనం అనుభూతి చెందలేదన్నది స్పష్టము.

విషయాలకు సంబంధించిన పాక్షిక మరియు పరోక్ష దృశ్యాన్ని మాత్రమే బుద్ధి ఇవ్వగలదు. బుద్ధి సంబంధిత దృష్టితో ఒక విషయంతో ఏకత్వం పొంది చూడటం సాధ్యం కాదు: అది దాని నుండి వేరుగా ఉండి చూడడం మాత్రమే; కాని తరువాత వివరించబడే దివ్యజ్ఞానం సత్యము యొక్క ప్రత్యక్ష అవగాహన. ఈ దివ్య జ్ఞానం వల్లనే ఆనంద చైతన్యం లేక భగవత్ చైతన్యం అనుభవమవుతుంది.

ఈ ఆనంద చైతన్యం లేదా భగవత్ చైతన్యమునకు మనం వీలుకల్పిస్తే, మన పనులన్నిటిలో, భావాలలో వ్యాపించగలదు.

మనల్ని మనం తెలుసుకొన్నప్పుడే భగవంతుని తెలుసుకోగలము. ఎందుకంతే మన నిజస్వభావం ఆయన స్వభావం వంటిదే. మానవుడు దేవుని ప్రతిరూపంగా సృష్టించబడ్డాడు. ఇక్కడ సూచించిన పద్ధతులను నేర్చుకొని చిత్తశుద్ధితో సాధన చేస్తే, మిమ్మల్ని మీరు ఆనందస్వరూపమైన ఆత్మగా తెలుసుకొని, దైవ సాక్షాత్కారం పొందుతారు.

మత విజ్ఞాన శాస్త్రము అనే పుస్తకం యొక్క కాపీలను కొనుగోలు చేయడానికి, దయచేసి వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ బుక్ స్టోర్ సందర్శించండి.

ఇతరులతో పంచుకోండి