జూన్ 15, 1965లో, లాస్ ఏంజిలిస్ లోని సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో జరిగిన సత్సంగంలో శ్రీ దయామాత గారు ఇచ్చిన ప్రసంగంలోని భాగం ఇది. “మన భయాలను ఎదుర్కొవడానికి ధైర్యం” అన్న శీర్షిక గల ఈ ప్రసంగం, 2020లో యోగదా సత్సంగ పత్రికలో ప్రచురించబడింది. అంతేకాక, త్వరలో విడుదల కాబోతున్న శ్రీ దయామాత గారి ప్రసంగాల మూడవ సంకలనమైన జర్నీ విత్ పరమహంస యోగానంద అనే పుస్తకంలో ఇది ఒక అధ్యాయం కానుంది. 1955 నుంచి 2010లో పరమపదించే వరకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/ సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క అధ్యక్షురాలు మరియు సంఘమాతగా శ్రీ దయామాత తమ సేవలందించారు.
ప్రతి మానవుడు ధైర్యం అనే గుణాన్ని అలవరచుకోవాలి. ధైర్యం అంటే భయం లేకపోవడమే అని కాదు; ఒక వ్యక్తి తీవ్రమైన భయాన్ని అనుభవిస్తున్నప్పటికీ, ధైర్యంగా ఉండవచ్చు. తన భయాలకు లొంగిపోకుండా, వాటిని ఎదుర్కొని, జయించాలని దృఢంగా నిశ్చయం చేసుకున్న వ్యక్తి నిజమైన ధైర్యవంతుడు.
మనం దేని గురించైనా కారణం తెలియకుండానే భయపడవచ్చు; ఈ భయం బహుశా ఈ జన్మలో కాని, ఒక పూర్వజన్మలో కాని జరిగిన, మనం మరచిపోయిన ఏదైనా బాధాకరమైన అనుభవం వల్ల కావచ్చు. కాని, మనం మన అభద్రతా భావాలను నిష్పాక్షికంగా పరిశీలిస్తే, సాధారణంగా, అవి నిరాధారమైనవని కనుగొంటాము. “మనం భయపడవలసిన ఏకైక విషయం – భయం మాత్రమే.”* ఈ మాటల్లో ఎంతో నిజం ఉంది. తరచుగా, మన సుఖక్షేమమునకు ముప్పు కలిగించే ముఖ్య కారణాలు, మనం ఎదుర్కొనే బయటి పరిస్థితులలో కాక, వాటిని ఎదుర్కోవడంలో మనం మన ఆత్మలో సహజంగానే ఉన్న శక్తి, విశ్వాసాలను ఉపయోగించడం నేర్చుకోకపోవడంలో ఉంటాయి.
నా చిన్నతనంలో, చీకటి అంటే తీవ్రమైన భయాన్ని కలిగించే ఒక అనుభవం నాకు కలిగింది. నాకు సుమారు ఎనిమిది లేక తొమ్మిది సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఒకరోజు మా అమ్మ పసిబిడ్డ అయిన మా తమ్ముడిని కొంచెం సేపు పట్టుకోమని నన్ను అడిగారు. నేను ఒక కిటికీ వద్ద కూర్చుని మా తమ్ముడిని నా ఒడిలో నెమ్మదిగా ఊపుతున్నాను. ఆ సమయంలో నేను “అలీ బాబా, నలభై దొంగలు” అన్న కథ చదువుతున్నాను; అందులోని దొంగలు వారి బాధితుల పట్ల చేసిన ఘోరకృత్యాల భయంకర దృశ్యాలతో సున్నితమైన నా చిన్న మనస్సు నిండి ఉంది. అప్పుడు మా ఇరుగుపొరుగు కుర్రవాళ్ళు ఒక అల్లరి పని చేయడానికి నిర్ణయించుకున్నారు. వాళ్లు రహస్యంగా కిటికీ బయటకు వచ్చి, ఉన్నట్టుండి భయంకరంగా అరవడం ప్రారంభించారు. నేను తీవ్రమైన భయంతో, కుర్చీలోనుంచి ఉలిక్కిపడి లేచాను.
ఆ తరువాత చాలాకాలం పాటు, చీకటిలో ఏమి దాగి ఉందోనన్న భయం అంతర్లీనంగా నాలో చాలా ఉండేది. దేనికీ భయపడడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదు. కాబట్టి ఒక రోజు నన్ను నేను ఇలా ప్రశ్నించుకున్నాను, “అసలు నాలో ఉన్న లోపం ఏమిటి? చీకటంటే నేనెందుకు భయపడుతున్నాను?” నేను వెళ్లగలిగినన్ని చీకటి గదులలో కావాలని నడవడం ద్వారా నా భయాన్ని జయించాలని నేను నిశ్చయించుకున్నాను. అప్పుడు నేను సరిగ్గా అదే చేశాను.
స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు చెప్పినట్లుగా “నీ భయానికి కారణమైనడానికి ఎదుటపడి చూడు; అది నిన్నింక ఇబ్బంది పెట్టదు.” మీ భయాల నుంచి దూరంగా పారిపోవడానికి ప్రయత్నించి లాభం లేదు; ఎందుకంటే మీరు వెనక్కి తిరిగి వాటిని ఎదుర్కొనేంత వరకూ అవి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. మీరు ఇది మొదటిసారిగా ప్రయత్నించినప్పుడు అది చాలా కష్టంగా అనిపించవచ్చు; అయినా సరే, చేసి చూడండి. రెండవసారి కొంచెం సులభంగా అనిపిస్తుంది. ఆపై ఎంతోకాలం పట్టకుండానే మీరు ఆ భయాన్ని జయిస్తారు. ధైర్యాన్ని అలవరచుకోవడమే ధైర్యాన్ని పెంపొందించుకునే మార్గం.
అధోసూచి:
* ఫ్రాంక్లిన్ డీ. రూజ్‌వెల్ట్
ప్రేమతోను, వినయంతోను, మరియు భగవంతుడికి, తమ గురుదేవులైన పరమహంస యోగానంద గారికి అంకితమైన సేవలతోను నిండిన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క ప్రియతమ మూడవ అధ్యక్షురాలు మరియు సంఘమాత అయిన శ్రీ దయామాత గారి స్ఫూర్తిదాయకమైన జీవితం గురించి మరింతగా తెలుసుకోవడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.




















